తమ పార్టీ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వెనుక ఎవరున్నారో తేల్చాల్సి వుందని తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర రావు డిమాండ్ చేశారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో నిందితులు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్ జరిపిన చర్చల వీడియోను సీఎం ప్రదర్శించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే 100 కోట్లైనా ఇస్తామని, ఎలాంటి సమస్య రాకుండా చూసుకుంటామని ముఠా పేర్కొందని తెలిపారు. వై సెక్యూరిటీ భద్రత కల్పిస్తామని అంటూ ఎమ్మెల్యేల కొనుగోలుకు ముఠా ప్రయత్నించిందని, అసలు వై సెక్యూరిటీ భద్రత కల్పిస్తామని చెప్పడానికి వీరెవరు? అంటూ సీఎం అగ్గిమీద గుగ్గిలమయ్యారు. గత నెలలోనే ఇక్కడికి రామచంద్రభారతి వచ్చి అనేక ప్రయత్నాలు చేశారని అన్నారు. విశ్వప్రయత్నం చేసి తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిసి మాట్లాడారని తెలిపారు. వాళ్లు ఏం ప్లాన్ చేశారో అర్థమైన తర్వాత.. రోహిత్ రెడ్డి తమకు చెప్పారని సీఎం వెల్లడించారు. ఆ తర్వాత హోంమంత్రికి కూడా ఫిర్యాదు చేశారని, ఈ వ్యవహారంపై సమగ్రమైన విచారణ జరగాల్సిందే అని కేసీఆర్​ డిమాండ్ చేశారు.

 

తమ ఎమ్మెల్యేలకు ఎర వేసిన నిందుతులు తరుచూ మోదీ, అమిత్ షా, బీఎల్ సంతోష్, జేపీ నడ్డా పేర్లు బహిరంగంగానే ప్రస్తావించారని కేసీఆర్ అన్నారు. బెంగాల్ ఎన్నికల సభలో 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో వున్నారని సాక్షాత్తూ ప్రధానే అంటే… ఇక ఆయన కింద వున్నవారు ఎలా వుంటారని ఎద్దేవా చేశారు. ఈ ముఠాలో మొత్తం 24 మంది వున్నారని, అందులో కేరళకు చెందిన తుషార్ ఒకరు అని సీఎం వివరించారు. ఈయన రాహుల్ మీద వయనాడ్ లో పోటీ చేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. నిందితుల్లో ఒక్కొక్కరికి 2,3 ఆధార్లు వున్నాయని, పాన్ కార్డులు కూడా 2,3 వున్నాయని అన్నారు. ఈ నకిలీవి ఎక్కడి నుంచి వస్తాయని, వేల కోట్ల రూపాయలు ఎక్కడివి అంటూ సీఎం విరుచుకుపడ్డారు.

 

మోదీజీ…. చెడ్డ పేరు తెచ్చుకోకుండి….

ప్రధాని మోదీ గారూ.. చెడ్డపేరు తెచ్చుకోవద్దని సీఎం కేసీఆర్ హితవు పలికారు. నేను మీ రాజకీయ సహోద్యోగిని, మీరు ప్రధాని అయినప్పుడే సీఎం అయ్యాను. 8 సంవత్సరాలుగా మీతో పనిచేస్తున్నా. ఈ దుర్నీతిని ఆపండి. లేకుండే దేశ చరిత్రలో మీకు చెడ్డ పేరు వస్తుంది. మంచి పనులు చేసి, మంచి స్థానం పొందాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.