దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోందని, ప్రజాస్వామ్య హంతకులు స్వైర విహారం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొదటిసారి భారమైన మనసుతో, దు:ఖంతో చెబుతున్నానని, పదవులు లేకున్నా, 50 ఏళ్ల నుంచి రాజకీయాల్లో వున్న అనుభవంతో చెబుతున్నానని, దేశం ఇబ్బందికర పరిస్థితుల్లో వుందన్నారు. దేశ పునాదులకే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం రాత్రి ప్రగతి భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఢిల్లీ వారు కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

 

 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. నిజానికి రెండు రోజుల క్రితమే మీడియా ముందుకు రావాలని భావించానని, అయితే… మునుగోడులో లబ్ధి పొందేందుకు ఇలా చేశారని చిల్లర ఆరోపణలు చేస్తారన్న ఉద్దేశంతో పోలింగ్ ముగిసే వరకూ వేచి చూశానని కేసీఆర్ వెల్లడించారు. మూడు గంటల నిడివి ఉన్న వీడియోలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు సుప్రీంకోర్టు జడ్జిలందరికీ, అన్ని రాష్ట్రాల హైకోర్టు సీజేలకు, సీఎంలకు, సీబీఐ, ఈడీకి, అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు కూడా పంపుతామని వెల్లడించారు.

న్యాయ వ్యవస్థకు చేతులు జోడించి అడుగుతున్నా….

దేశం ప్రమాదంలోకి వెళ్లకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను న్యాయవ్యవస్థ కాపాడాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. సీజేఐ జస్టిస్ యూయూ లలిత్, సుప్రీం న్యాయమూర్తులు, అన్ని రాష్ట్రాలు చీఫ్ జస్టిస్ లను చేతులు జోడించి వేడుకుంటున్నానని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దురాగతాలు కొనసాగడానికి వీల్లేదని, దీనిని సింగిల్‌ కేస్‌గా చూడవద్దని న్యాయ వ్యవస్థను కోరారు. ఇదే కొనసాగితే దేశంలో అరాచకత్వం, భరించరాని హింస చెలరేగుతుందని, భారత సమాజ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని, అనారోగ్యకర పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. దేశంలోని ప్రతి వ్యక్తి ఈ దురాగతాలను, ఘాతుకాలను తెలుసుకోవాలనే పంపిస్తున్నామని వివరించారు.

 

మా దగ్గరికే వచ్చి మా వారినే కొంటే చేతులు ముడుచుకోవాలా?

తమ రాజధానికి వచ్చి మీ ఎమ్మెల్యేలను కొంటం. మీ సర్కారును కూలుస్తామని అంటే మేం చేతులు ముడుచుకుని కూర్చోవాలా? అని సీఎం ప్రశ్నించారు. తన ప్రభుత్వాన్నే కూలగొడతానంటే నేను ఊరుకోవాలా? మీ హేయమైన,అరాచక విధానాన్ని మౌనంగా భరించాలా? అని నిలదీశారు. భరించేది లేదని తేల్చి చెప్పారు. దేశం కోసం చావడానికైనా సిద్ధం. చావొస్తే చస్తాం దేశం కోసం. కానీ, దేశాన్ని విచ్చలవిడిగా సర్వనాశనం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. క్రూర, విశృంఖల పద్ధతుల్లో జరిగే దమనకాండను, రాజకీయ హనానాన్ని అడ్డుకోకపోతే దేశ ఉనికి అంతర్జాతీయ స్థాయిలో దిగజారిపోతుంది అని అన్నారు.