తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ముస్లింలకు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, బీఆర్ఎస్ నేతలు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇఫ్తార్‌కు హాజరైన ప్రజాప్రతినిధులు, ముస్లిం మతపెద్దలతో కలిసి ప్రార్థనలు చేశారు. అజాన్‌ పిలుపు తర్వాత ఇస్లాం సాంప్రదాయ పద్ధతిని అనుసరించి తనతోపాటు ఆశీనులైన పలువురికి ఇఫ్తార్‌ విందును అందించి రోజాను విరమింపజేశారు. అనంతరం ప్రముఖులతో కలిసి విందులో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడు కూడా ఇఫ్తార్‌ విందును ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. 9 ఏండ్ల క్రితం మనల్ని వెనుకబడినవారిగా పరిగణించేవారని, కానీ నేడు అల్లా దయతో, మీ అందరి ప్రార్థనలతో తెలంగాణ రాష్ట్రానికి దేశంలో పోటీ అనేది లేదని ప్రకటించారు.

ఇది తాను చెప్తున్నది కాదని, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఈ విషయాన్ని వెల్లడించిందన్నారు. దేశంలో మరే రాష్ట్రానికి లేనివిధంగా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,17,115 ఉందని, మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటక వంటి పెద్దపెద్ద రాష్ట్రాలకంటే మనం ముందంజలో ఉన్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తలసరి విద్యుత్తు వినియోగం 1,000-1,050 యూనిట్లు ఉండేదని, నేడు అది 2,100 యూనిట్లకు పెరిగిందని ప్రకటించారు. పరిశ్రమలు, ఐటీ రంగంలో పురోగమిస్తున్న తీరును అందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు.

 

తెలంగాణ ఆవిర్భావానికి ముందు పదేళ్లపాటు పాలించిన కాంగ్రెస్‌ పార్టీ.. ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి చేసిన ఖర్చు రూ.1180 కోట్లు మాత్రమేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. కానీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ పదేళ్లలో రూ.12 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. గతంలో మాదిరిగా ఇప్పుడు రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు లేవని, జీవన పోరాటంలో భాగంగా బయటి రాష్ట్రాలకు వెళ్లిన రైతులు కూడా తిరిగి వారి ఊళ్లకు వచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 94 లక్షల ఎకరాల్లో వరి పంటను పండించుకుంటున్నామని, దేశం మొత్తమ్మీద సాగుచేసిన 66 లక్షల 40 ఎకరాల వరిసాగు విస్తీర్ణం కంటే తెలంగాణలోనే పండించిన వరి సాగు విస్తీర్ణమే చాలా ఎక్కువ అని ప్రకటించారు.

భారతదేశం మనందరిది. దీనిని సురక్షితంగా కాపాడుకుందామని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం పోరాడినట్టుగానే ఉజ్వల భారతం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుదామని, రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. మనం మన దేశాన్ని కాపాడుకోవాలని పెద్దలను, యువతను కోరుతున్నట్లు తెలిపారు. చిన్న చిన్న కష్టాలు వస్తూనే ఉంటాయని, మీ సహకారం ఉంటే చివరి వరకు పోరాడుతూనే ఉందామని ప్రకటించారు. ఇది తాత్కాలిక దశ అని, ఈ సమయంలో మనం నిరాశ పడకూడదున్నారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుంది. తెలంగాణ కోసం పోరాడినట్లుగానే ఉజ్వల భారతదేశం కోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడి లక్ష్యాన్ని చేరుకోవడం తథ్యమని అన్నారు. ఈ దేశ గంగా జమున సంస్కృతిని, ఆచార, సంప్రదాయాలను ఎవరూ మార్చలేరని కేసీఆర్ ప్రకటించారు.