భారత రాష్ట్ర సమితిని దేశ వ్యాప్తంగా చాలా వేగంగా విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీయేతర పక్షాలను సాధ్యమైనంత మేర కలుపుకు పోయేందుకే సాయశక్తులా పనిచేస్తున్నారు. ఇందు కోసం పనికొచ్చే అన్నింటినీ వాడుకుంటున్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హైదరాబాద్ కి వచ్చారు. లంచ్ టైమ్ లో ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా భగవంత్ మాన్ కి కేసీఆర్ ఘనంగా స్వాగతం పలికారు. దేశ రాజకీయ పరిస్థితులతోపాటు తెలంగాణ ప్రగతి, పంజాబ్‌ రాష్ట్ర పాలన తదితర అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించారు. బీఆర్ఎస్ విధానాలు, జాతీయ విధానాలపై ఇరువురూ చర్చించుకున్నారు. అనంతరం భగవంత్‌ మాన్‌కు సీఎం కేసీఆర్‌ శాలువా కప్పి, జ్ఞాపికను బహూకరించారు. ఈ సమావేశంలో ఎంపీ సంతోష్‌ కుమార్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్సీలు ఎస్‌ మధుసూదనాచారి, కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.