ఖమ్మంలో బీఆర్ఎస్ సభ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర సోమవారం ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ సభ నిర్వహించే తీరు తెన్నులు, ప్రజా సమీకరణపై ప్రధానంగా చర్చించారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం… రాత్రి 8:30 గంటల వరకూ కొనసాగింది. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్, పువ్వాడ అజయ్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర రావు, రవిచంద్ర, పార్థసారథి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, హరిప్రియ, ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, రేగా కాంతారావు, తాతా మధు, పల్లా రాజేశ్వరెడ్డి తదితులు పాల్గొన్నారు.
తెలంగాణలో జరగనున్న మొట్టమొదటి బీఆర్‌ఎస్ సభను విజయం చేసేందుకు అధినేత సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నేతలకు పలు సూచనలు చేశారు.దేశ నలుమూలల నుంచి రాజకీయ ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులు, మేధావులు అధిక సంఖ్యలో హాజరవనున్న ఈ సభకు ఏర్పాట్లు కూడా గొప్పగా ఉండేలా చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. దేశవ్యాప్తంగా అందరి చూపు ఖమ్మం సభపై ఉంటుందని, ఈ నేపథ్యంలో ఎక్కడా లోటుపాట్లు తలెత్తకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. సభ ఏర్పాట్లు మొత్తం మంత్రి హరీశ్ కి సీఎం కేసీఆర్ అప్పజెప్పారు. ఖమ్మం సభ చరిత్ర నెలకొల్పేలా వుండాలని సీఎం అన్నారు.
ఇక.. ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ సభకు కేరళ సీఎం పినరయ్ విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తో పాటు రైతు సంఘాల నేతలు హాజరవుతారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సభకు వచ్చే వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని, బీఆర్ఎస్ ఆవిర్భావ సభపై దేశం మొత్తం ఆసక్తితో వుందన్నారు. ఖమ్మం చైతన్యానికి మారు పేరు అని, అందుకే బీఆర్ఎస్ తొలి సభ అక్కడి నుంచే నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ నేతలకు వివరించారు. టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో కరీంనగర్ లో నిర్వహించిన సింహగర్జన సభను తలపించేలా జన సమీకరణ వుండాలన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు ఏపీ నుంచి కూడా ప్రజలు పాల్గొనేలా చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.







