రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మెట్రో రెండోదశ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్పోర్ట్ ఎక్స్‌ప్రెస్ మెట్రోకు గచ్చిబౌలి సమీపంలోని ఐకియా ఎదుట ఉన్న మైండ్‌స్పేస్ వద్ద పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా అప్పా దగ్గర ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగించారు. భవిష్యత్‌లో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రోను విస్తరిస్తామని కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర సహకారం ఉన్నా లేకున్నా.. మెట్రోను విస్తరిస్తామని సీఎం స్పష్టం చేశారు. మైండ్ స్పేస్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరం.. వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ, జీఎంఆర్ నిధులతో ప్రారంభం చేసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నానని కేసీఆర్ చెప్పారు.

హైదరాబాద్ అన్ని వర్గాల వారిని అక్కున చేర్చుకుంటామన్నారు. హైదరాబాద్ చరిత్రలోనే కాదు వర్తమానంలోనూ గొప్ప నగరమన్నారు. హైదరాబాద్ సంస్కృతి మన సొంతమన్నారు. సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదన్నారు. గొప్ప గొప్ప పరిశ్రమలు హైదరాబాద్‌లో కొలువుదీరుతున్నాయి. పరిశ్రమల రంగంలో ముందుకు దూసుకుపోతున్నాం. అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్లతో ట్రాఫిక్ కష్టాలు తీర్చుకుంటున్నాం. ఆఫీస్ స్పేస్, రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనలు సడలించడంతో నిర్మాణం రంగం పుంజుకుందని సీఎం కేసీఆర్ వివరించారు.
సమైక్య పాలకుల వల్ల చాలా బాధలు అనుభవించామని కేసీఆర్ పేర్కొన్నారు. తమకు కరెంట్ ఇవ్వాలని, సరిపోవడం లేదని బాధపడ్డ సందర్భాలున్నాయని గుర్తు చేసుకున్నారు. ఈ కారణాల చేత వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతాం అని పారిశ్రామిక వేత్తలు ఇందిరా పార్కు వద్ద ధర్నాలు చేశారన్నారు. హైదరాబాద్‌లో ఏ బస్తీకి వెళ్లినా చాలా భయంకరమైన మంచినీటి బాధలు ఉండేవన్నారు. కృష్ణా, గోదావరి నుంచి నీటి సరఫరా పనులు నత్తనడకన నడిచాయని, అవన్నీ క్లియరెన్స్‌లు సాధించి మంచినీటి వసతి ఏర్పాటు చేసుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. క్షణం పాటు కరెంట్ పోని పరిస్థితి చేసుకున్నాం. హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్‌గా మార్చాం. హైదరాబాద్ నగరం పవర్ సెక్టార్లో అనుసంధానం అయ్యిందని సీఎం వివరించారు.