హైదరాబాద్‌ కాచిగూడలో ఉన్న కర్ణాటక సాహిత్య మందిర పునర్నిర్మాణం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే, అధికారులను ఆదేశించారు. సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు కమ్యూనిటీ అవసరాల కోసం వినియోగించుకొనేలా మౌలిక వసతులు కల్పించాలని, ఆడిటోరియాన్ని తీర్చిదిద్దాలని సూచించారు.

 

హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పర్చుకొని దశాబ్దాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల వారి సాహిత్య, సంస్కృతీ సంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని సీఎం పేర్కొన్నారు. వివిధ వర్గాలతో గంగా జమునా తహెజీబ్‌కు ప్రతీకగా కొనసాగుతున్న హైదరాబాద్‌ జీవన విధానాన్ని నిలుపుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ కృషి కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. తమ విజ్ఞప్తి మేరకు రూ.5 కోట్లు మంజూరు చేయడంపై అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.