సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న రాష్ట్ర సచివాలయానికి భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం ఆదేశాలు జారీచేశారు.రాష్ట్ర సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వ కారణమన్నారు. తాము తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన గౌరవం, హక్కులు దక్కాలన్న అంబేద్కర్ స్ఫూర్తితో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
అంబేద్కర్ కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉందని అన్నారు. ఫెడరల్ స్ఫూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించబడుతాయనే అంబేద్కర్ స్ఫూర్తి మమ్మల్ని నడిపిస్తోందని సీఎం తెలిపారు. దేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడడమే నిజమైన భారతీయత అని వివరించారు.
భారత నూతన పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్ పేరును పెట్టాలని ఏదో ఆశామాషీకి కోరుకున్నది కాదన్నారు. భారతదేశ గౌరవం మరింతగా ఇనుమడించబడాలంటే, అంబేద్కర్ పేరును మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించామని గుర్తు చేశారు. అందుకు సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. ఇదే విషయమై నేను ప్రధాని మోదీకి త్వరలో స్వయంగా లేఖ పంపుతానని సీఎం ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని నూతనంగా నిర్మిస్తున్న భారత పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరును పెట్టాలని నీను మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నాను’’ అని కేసీఆర్ ప్రకటించారు.