యాదాద్రి అల్ట్రా మెగా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నుల‌ను సీఎం కేసీఆర్ ప‌రిశీలించారు. ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణ ప‌నులను కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ప‌రిశీలించారు. ప్లాంట్ నిర్మాణ ప‌నుల తీరును అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఆ శాఖ ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా ప‌నుల పురోగ‌తిని ప‌రిశీలించారు. నిర్మాణ ప‌నుల వివ‌రాల‌ను ముఖ్య‌మంత్రికి అధికారులు వివ‌రించారు. ఫ‌స్ట్ స్టేజ్ యూనిట్ 2లో బాయిల‌ర్ నిర్మాణంలో 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్‌లో జ‌రుగుతున్న ప‌నుల‌ను సీఎం ప‌రిశీలించారు. ఈ పరిశీలన తర్వాత సీఎం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 2023, డిసెంబ‌ర్ చివ‌రి నాటికి యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి, విద్యుత్ ఉత్ప‌త్తిని ప్రారంభించాల‌ని అధికారుల‌కు సూచించారు.

యాదాద్రి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ ప్రాజెక్టు యావ‌త్ దేశ కీర్తిని పెంచుతుంద‌ని సీఎం పేర్కొన్నారు. 4 వేల మెగావాట్ల సామ‌ర్థ్యం గ‌ల ప్లాంట్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంద‌ని తెలిపారు. రాష్ట్ర రైతులు, ప్ర‌జ‌ల శ్రేయ‌స్సును కాంక్షించి ప్ర‌యివేటు, కార్పొరేట్ల ఒత్తిడికి లొంగ‌కుండా ప్ర‌భుత్వ రంగంలోనే థ‌ర్మ‌ల్ పవ‌ర్ ప్రాజెక్టు నిర్మాణం చేప‌ట్టిన‌ట్లు పేర్కొన్నారు. యాదాద్రి అల్ట్రా మెగా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయాల‌ని సీఎం సూచించారు.

ప్లాంట్ ఆప‌రేష‌న్‌కు స‌రిప‌డా బొగ్గు నిల్వ‌లు ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు. యాదాద్రి ప్లాంట్ నుంచి హైద‌రాబాద్ స‌హా అన్ని ప్రాంతాల‌కు విద్యుత్ క‌నెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. బొగ్గు నిల్వ‌లు స‌హా ఇత‌ర ఆప‌రేష‌న్ విష‌యంలో అధికారులు ముందుచూపుతో వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు.