ఢిల్లీ పీఠం కదిలే విషయం తమ దగ్గర వుందని సీఎం కె. చంద్రశేఖర రావు బాంబు పేల్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఇప్పటి వరకూ చూసింది కొంతేనని, ప్రజలకు చూపించాల్సింది ఇంకా వుందన్నారు. బీజేపీ ఢిల్లీ బ్రోకర్లు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామని వచ్చారని, ఇప్పుడు చంచల్ గూడ జైళ్లో వున్నారని ఎద్దేవా చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. తాను రాజ్యాంగబద్ధమైన సీఎం పదవిలో వున్నానని, కేసు కోర్టులో వుంది కాబట్టి, తాను ఎక్కువగా మాట్లాడలేనని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో అన్ని విషయాలూ బయటపడతాయని అన్నారు. ప్రజలు టీవీలో చూసింది చాలా చిన్నదని, చూడాల్సింది ఇంకా వుందన్నారు.

 

ఈ నలుగురు ఎమ్మెల్యేలు పులి బిడ్డలు

మొయినాబాద్ ఫాం హౌస్ వ్యవహారంలో వున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, రేగా కాంతారావు సీఎం కేసీఆర్ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారిని ప్రజలకు చూపిస్తూ పులి బిడ్డలు అంటూ పరిచయం చేశారు. వంద కోట్ల రూపాయలు ఇస్తామని, పార్టీని విడవాలని ఢిల్లీ వారు వారి దగ్గరికి వస్తే.. ఎడమ కాలి చెప్పుతో కొట్టారని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారే రాజకీయాలకు కావాలని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొనేందుకు వంద కోట్లు ఇస్తామన్నా… గడ్డిపోచగా భావించి, విసిరి కొట్టారని ప్రకటించారు. తాము అంగట్లో సరుకు కాదని, తెలంగాణ బిడ్డలమని నిరూపించారని అన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవ బాటాను హిమాలయ పర్వంత అంత ఎత్తుకు తీసుకెళ్లారని ప్రశంసించారు.

 

మోదీ గారూ ఇంకా ఏం కావాలి? అంటూ నిప్పులు

మునుగోడు సభలో సీఎం కేసీఆర్ మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోదీ గారూ.. ఇంకా ఏం కావాలి మీకు? ఈ దేశంలో ప్రధాని పదవిని మించింది లేదు కదా! రెండుసార్లు అవకాశం వచ్చింది కదా! ఎందుకీ కిరాతకం? అంటూ ప్రశ్నించారు. ఈ కొనుగోళ్ల వ్యవహారం సమాజానికి ఏ రకంగా మంచిదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆఫర్ చేసిన వందల కోట్లు ఎవరిచ్చారని? ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్నవారు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండటానికి అర్హులు కారని చెప్పారు. ఇంత అరాచకం జరుగుతున్నా మౌనంగా ఉంటే.. అదే మనకు శాపమవుతుందని హెచ్చరించారు.