బీఆర్ఎస్ సభా వేదికగా ద్వారా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఖమ్మం జిల్లాకి వరాల జల్లు కురిపించారు. ఖమ్మంలో 589 గ్రామ పంచాయతీలు వున్నాయని, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి గ్రామానికి 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఖమ్మం మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ. 30కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. సత్తుపల్లి, మధిర, వైరాలను సైతం ఖమ్మం మున్సిపాలిటీ తరహాలో అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. పెద్దతాండ, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి 10 వేల జనాభాకు మించి ఉండి.. మేజర్‌ గ్రామ పంచాయతీలుగా ఉన్న గ్రామాలకు ఒక్కోదానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. మ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ కళాశాలను జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో మంజూరు చేస్తామని ప్రకటించారు.

ఖమ్మం హెడ్‌ క్వార్టర్‌లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నెల రోజుల్లోనే ఇండ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, జిల్లా కలెక్టర్‌ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల గురించి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ స్థలం లేకుంటే ప్రభుత్వమే భూమిని సేకరించి జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తుందని ప్రకటించారు. ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టలందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు.