రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకలకు రాష్ట్రం నలుమూల నుంచి దాదాపు 12 వేలకు పైగా క్రైస్తవులు తరలిరాగా, వారికి ప్రభుత్వం ఆధ్వర్యంలో విందును ఏర్పాటు చేశారు. తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనాథ బాలలకు గిఫ్ట్‌ ప్యాక్‌లను అందజేశారు. క్రిస్మస్‌ ట్రీని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి మతపెద్దలకు తినిపించారు. క్రైస్తవులందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలను తెలియజేశారు. మతపెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… కులం, మతం, జాతి, వర్గం అనే వివక్షలేని భారతావని కోసం అందరం ముందుకు సాగాలని కోరారు.

తెలంగాణ సాధించిన పురోగతి దేశవ్యాప్తం కావాలని, ఆ దిశగా పోరాడేందుకు అందరి సహకారం కావాలని కోరారు. క్రీస్తు బోధనలను పాటిస్తే ఈ ప్రపంచంలో ఈర్ష్య, అసూయ, ద్వేషం, స్వార్ధం, ఇతరుల పట్ల అసహనం అనేవి ఉండనే ఉండవన్నారు. ఒకమాటలో చెప్పాలంటే ప్రపంచంలో అసలు యుద్ధాలే జరగవని, నేరస్థులుగా పరిగణించి జైళ్లల్లో ఉండేవాళ్ల కోసం జైళ్లే అవసరం ఉండదని ప్రకటించారు. నిజంగా ఏసుక్రీస్తు చెప్పిన ప్రపంచం.. ఆయన కలలుగన్న ప్రపంచం ఎంతో ఉదాత్తమైనది. ఉన్నతమైనదన్నారు.

యావత్‌ సమాజం ముందుకు పురోగమించే అవసరం ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. 20 ఏండ్ల క్రితం అశాంతితో, వలసలతో, ఆత్మహత్యలతో దిక్కుతోచని స్థితిలో భయయంకరమైన వివక్షకు గురి అవుతూ చిన్నబుచ్చుకొని ఉన్న తెలంగాణ సమాజాన్ని చూసి ‘జై తెలంగాణ’ నినాదంతో మనం యుద్ధం ప్రారంభించామని గుర్తు చేశారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది. ఏడేండ్ల క్రితం మన తలసరి ఆదాయం లక్ష రూపాయలే వుండెనని,ఈరోజు మన తలసరి ఆదాయం రూ.2. 75 లక్షలు సాధించామని వివరించారు. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్తు వినియోగంలో, ఇంకా అనేక విషయాల్లో నంబర్‌ 1, నంబర్‌ 2 స్థానాలకు తెలంగాణ పురోగమించిందని కేసీఆర్ తెలిపారు.