తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ తీపి కబురు అందజేశారు. యాసంగి సీజన్ కి సంబంధించి, రైతుబంధును ఈ నెల 28 నుంచి పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటూ.. 7,600 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావును సీఎం ఆదేశించారు. ఎప్పటి మాదిరిగానే ఎకరం నుంచి ప్రారంభించి, సంక్రాంతి కల్లా రైతులందరి ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. పంట పెట్టుబడిని అందించడం దేశ వ్యవసాయ రంగంలో సత్ఫలితాలను ఇస్తోందని సీఎం పేర్కొన్నారు. సంక్రాంతి వరకు అర్హులైన ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో నిధులు జమ చేయనున్నారు. ఈ సీజన్‌లో సుమారు 66 లక్షల మంది రైతుల కోసం రూ.7,600 కోట్ల నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గత సీజన్‌ వరకు రైతుబంధు ద్వారా రూ.57,881 కోట్లను ప్రభుత్వం కర్షకుల ఖాతాల్లో జమ చేసింది. రైతుబంధు పంపిణీకి సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి వ్యవసాయ, ఆర్థికశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.

రైతులకు సంబంధించిన వివరాలను నేడు లేదా రేపు రెవెన్యూ శాఖ (సీసీఎల్‌ఏ) నుంచి వ్యవసాయశాఖ సేకరించనున్నది. అయితే.. ఈ సారి మరో లక్ష మంది రైతులు పెరిగే అవకాశం వుందని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు వానాకాలం, యాసంగి రెండు కాలాలకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం, పంట పెట్టుబడిని అందించడం, దేశ వ్యవసాయరంగంలో విప్లవాత్మక కార్యాచరణగా సత్ఫలితాలనిస్తోందన్నారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, తెలంగాణ రైతుల సంక్షేమం, వ్యవసాయరంగ అభివృద్ధి విషయంలో ఎన్ని కష్టాలెదురైనా రాజీ పడకుండా రైతులకు రైతుబంధు నిధులను టంచనుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నదని కేసీఆర్ అన్నారు.