బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు తెలంగాణ భవన్ లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ పార్టీ కార్యాలయంలో ఎగరేశారు. తర్వాత కేసీఆర్ అధ్యక్షన బీఆర్ఎస్ సమావేశం జరిగింది. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్నది బీఆర్ఎస్ నినాదమని, వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ కోటపై ఎగిరేది గులాబీ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు. దేశ పరివర్తనం కోసమే బీఆర్ఎస్ ను ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు అని, రాజకీయ పార్టీలు కాదని పునరుద్ఘాటించారు. దేశానికి ఇప్పుడు కొత్త ఆర్థిక విధానం అవసరమని, మహిళా సాధికారత కోసం కొత్త జాతీయ విధానాన్ని బీఆర్ఎస్ తరపున తీసుకొస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇకపై రాష్ట్రాల మధ్య జల యుద్ధాలు వుండవన్నారు.

రాబోయేది రైతు ప్రభుత్వమే అని సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే పార్టీ పాలసీలు రూపొందిస్తామన్నారు. రైతుపాలసీ, జల విధానం రూపొందిస్తాం అని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రచారం నిర్వహిస్తామని ప్రకటించారు. నాలుగైదు నెలల్లో ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభమవుతుందని సీఎం ప్రకటించారు. టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారడంపై కుమార స్వామి, నటుడు ప్రకాశ్ రాజ్ సీఎం కేసీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు.