తెలంగాణ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో కొత్త జాతీయ పార్టీ అవతరించింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ.. తెలంగాణ భవన్ లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. జాతీయ పార్టీకి సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో కార్యవర్గ సభ్యులందరూ ఆమోదించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో పాటు 283 మంది టీఆర్ఎస్ ప్ర‌తినిధులు ఆ తీర్మానంపై సంత‌కం చేశారు.

 

 

మరోవైపు ఈ తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆ తీర్మానాన్ని సభ్యులకు చదివి వినిపించారు. 21 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో కీలక మలుపుగా సీఎం అభివర్ణించారు. ఇక.. పార్టీ జెండా, ఎజెండాపై టీఆర్ఎస్‌ నేతలకు కేసీఆర్ వివరించారు. ఈ భేటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. జెడ్పీ చైర్మన్లు సహా 283 మంది ప్రతినిధులు హాజరైనారు.

 

 

టీఆర్ఎస్ ను కాస్తా బీఆర్ఎస్ గా మారుస్తూ చేసిన తీర్మానాన్ని ఢిల్లీకి పంపనున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బృందం ఢిల్లీకి తీసుకెళ్లనుంది. కేసీఆర్‌ కొనుగోలు చేసిన చార్టర్డ్‌ విమానంలో ఈ నెల 6న వీరు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ తీర్మానాన్ని సమర్పిస్తారు. ఈసీఐ దీనిని పరిశీలించి ఆమోదం తెలపగానే బీఆర్‌ఎస్‌ ప్రస్థానం మొదలవుతుంది. కాగా, జాతీయ పార్టీగా మారిన అనంతరం అఖిల భారత స్థాయిలో కొన్ని అనుబంధ సంఘాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలుత కిసాన్‌ సంఘ్‌ను ఏర్పాటు చేయనున్నారు.