ఇదే చిట్ట చివరి వార్నింగ్… 27 మందికి హెచ్చరికలు జారీ చేసిన సీఎం జగన్

గడప గడపకూ ప్రభుత్వం అన్న సమీక్షా కార్యక్రమం వేదికగా ఏపీ సీఎం జగన్ మరోసారి పార్టీ ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లపై తీవ్రంగా మండిపడ్డారు. 27 మంది ఎమ్మెల్యేల పేర్లు తీసుకుంటూ… పద్ధతి మార్చుకోవాలంటూ ఏకంగా వార్నింగ్ ఇచ్చేశారు. అంతేకాకుండా కొద్ది సేపు క్లాస్ కూడా తీసుకున్నారు. అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై రివ్యూ జరిగింది. దీనికి పార్టీ ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లు హాజరయ్యారు. అయితే.. ఈ కార్యక్రమం సక్సెస్ చేయడంలో కొంత మంది ఎమ్మెల్యేలు పూర్తిగా వెనకబడ్డారని, ఏమాత్రం శ్రద్ధవహించడం లేదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

 

ఆ 27 మంది ఎమ్మెల్యేలు పనుల్లో వేగం పెంచాలని, పనితీరు మెరుగుపరుచుకోవాలని తేల్చి చెప్పారు. లేదంటే.. వారి స్థానంలో మరొకర్ని నియమిస్తానని కఠినంగానే చెప్పారు. నెలకు 16 రోజులు గడప గడపకు మన ప్రభుత్వం అన్న కార్యక్రమంలో పాల్గొనాలని గతంలోనే సూచించామని, అయినా… పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్వయంగా ఎమ్మెల్యేలు పాల్గొనాలని, అంతేగానీ కుటుంబ సభ్యులు పాల్గొంటే… ఆ కార్యక్రమాన్ని పార్టీ పరిగణనలోకి తీసుకోదన్నారు.

 

అయితే… ఈ 27 మందిలో మంత్రులు కూడా వున్నారని తెలుస్తోంది. ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పినిపె విశ్వరూప్, హోంమంత్రి తానేటి వనిత ఈ జాబితాలో వున్నారు. ఇక.. ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాస్, చిట్టిబాబు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఆళ్లనానితో పాటు మరికొందరు వున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, అందుకే గడప గడపకు ప్రభుత్వం అన్న కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాల్సిందేనని సీఎం జగన్ అన్నారు. ఈ 27 మందికి ఇదే లాస్ట్ వార్నింగ్ అని, పనితీరు మెరుగుపరుచుకోవాలని జగన్ సూచించారు.

Related Posts

Latest News Updates