పర్యాటకుల భద్రతే లక్ష్యంగా ఏపీలో టూరిస్ట్ పోలీస్ స్టేషన్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీ వ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. పర్యాటకుల భద్రత కోసమే ఈ టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, 20 పర్యాటక ప్రాంతాల్లో ఈ సేవలను ప్రారంభిస్తున్నామని సీఎం ప్రకటించారు. యాత్రికులు నిర్భయంగా పర్యాటక ప్రదేశాల్లో గడిపేందుకు ఈ పోలీస్ స్టేషన్ల ఉపకరిస్తాయని సీఎం వివరించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం చేపట్టారని ప్రశంసించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నో సంస్కరణలు తెచ్చామన్నారు. పోలీసులు స్నేహితులన్న భావన తీసుకురాగలిగామని తెలిపారు. ప్రతి కియోస్క్ లోనూ దాదాపు ఆరుగురు సిబ్బంది రెండు షిప్టులలో పనిచేస్తారని తెలిపారు. కియోస్క్ లను ఎస్సై, ఏఎస్సై స్థాయి అధికారి పర్యవేక్షిస్తారని తెలిపారు.
ఇక.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… టూరిస్టులకు సహాయం చేయడానికే ఈ స్టేషన్లు అని,ఇతర రాష్ట్రాల నుంచి టూరిస్టులు రాష్ట్రానికి వచ్చినప్పుడు, వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా… సహాయం చేయడం కోసం ఈ స్టేషన్లు ఉపకరిస్తాయని అన్నారు. ఈ స్టేషన్ల ద్వారా అవసరమైన సమాచారం ఇవ్వడం, వాహనాలు అందించడం, అవసరమైతే ప్రథమ చికిత్స చేయడం, అత్యవసర సహాయం చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు అనేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలు నివారించేందుకు దిశా యాప్ ను తీసుకొచ్చామని గుర్తు చేశారు.













