ఏపీలో మరో కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పల్నాడు జిల్లా వేదికగా ప్రారంభించారు. దేశంలోనే గొప్ప మార్పుకు ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం నేటి నుంచి ప్రారంభిస్తున్నామని, ఈ విధానం దేశ చరిత్రలోనే రోల్ మోడల్ గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక వైద్యాన్ని ఉచితంగా ప్రజల గడప వద్దకే తీసుకొచ్చే విధానమే ఫ్యామిలీ డాక్టర్ విధానమని సీఎం జగన్ వివరించారు. వైద్యం కోసం ఏ పేదవాడూ ఇబ్బంది పడకూడదన్న గొప్ప ఉద్దేశంతోనే దీనిని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపై డాక్టర్ కోసం ప్రజలు బయటకు వెళ్లాల్సిన పనిలేదని, ప్రతి పేదవాడి ఇంటి ముందుకు డాక్టర్లు, మందులు వస్తాయని ప్రకటించారు. పెన్షన్లు ఇంటికే వచ్చినట్లు, వైద్యం కూడా ప్రజల ఇంటి ముందుకే వస్తుందని సీఎం జగన్ ప్రకటించారు.
వైఎస్సార్ విలేజ్ క్లీనిల్ లలో 105 రకాల మందులు, 14 రకాల టెస్టులు అందుబాటులో వుంటాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డాక్టర్ల సలహా తీసుకునే సదుపాయం వుందన్నారు. వైద్య సిబ్బంది పోస్టింగ్ వున్న చోటే అందుబాటులో వుండాలని సూచించారు. పేదలకు వైద్య, ఆరోగ్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వుండొద్దని సీఎం తెలిపారు. వైఎస్సార్ విలేజీ క్లీనిక్ లను పీహెచ్ సీలతో అనుసంధానిస్తామన్నారు. వైఎస్సార్ విలేజీ క్లీనిక్ లో 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, 105 రకాల మందులు అందుబాటులో వుంటాయని పేర్కొన్నారు.
ఆరోగ్య శ్రీ పేరు చెప్పగానే వైఎస్సార్ గుర్తుకు వస్తారని, ఆరోగ్యశ్రీ, 108,104 పథకాల రూపకర్త వైఎస్ అని గుర్తు చేసుకున్నారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా నిర్వీర్యం చేశారని ఆయన విమర్శించారు. మన ప్రభుత్వం ఆరోగ్య శ్రీ బకాయిలు మొత్తం చెల్లించిందని, 1000 కి పైగా జబ్బులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖపై ప్రతి యేటా 18 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని, రాష్ట్రంలో మరో 17 కొత్త మెడికల కాలేజీల నిర్మాణం చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.