అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు, ధర్నాలు చేస్తున్నారని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్ ను చూసి ఉద్యమాలా? అంటూ ప్రశ్నించారు. జగన్ శాసనసభలో పాలన వికేంద్రీకరణపై సుధీర్ఘంగా ప్రసంగించారు. ప్రతి ప్రాంతం బాగుండాలన్నదే తమ అభిమతమని, అమరావతిపై తనకేమీ కోపం లేదని ప్రకటించారు. విశాఖలో రోడ్డు వున్నాయని, డ్రైనేజీ, విద్యుత్ వుందన్నారు. విశాఖపై తనకేమీ ఎక్కువ ప్రేమ లేదని, ప్రజలందరిపై ప్రేమ వుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. అమరావతికి లక్షల కోట్లు ఖర్చయ్యాయని, కేవలం 10 వేల కోట్లు పెడితే విశాఖ డెవలప్ అవుతుందన్నారు.

చంద్రబాబు హయాంలో దోచుకో, పంచుకో, తీసుకో అనే పథకం మొదలైందని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ఒకటే రాజధానిగా అమరావతి సాధ్యమయ్యే పనేనా? అంటూ ప్రశ్నించారు. అమరావతి ప్రాంతంలో ఎవరు కొంటారు? ఎకరా 10 కోట్లకు ఎవరు కొంటారని నిలదీశారు. అమరావతి రాజధాని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల కోసం కాదని, కేవలం పెత్తందారుల కోసమేనని సీఎం జగన్ మండిపడ్డారు. 58 సంవత్సరాల్లో చంద్రబాబు చేసిందేమీ లేదని మండిపడ్డారు. వెయ్యి రోజులుగా రియల్ ఎస్టేట్ ఉద్యమం నడిపిస్తున్నారని, ఎవరి కోసం ఈ ఉద్యమాలు? అంటూ సీఎం జగన్ మండిపడ్డారు.












