ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఎస్సార్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. మూడో విడత కింద 51.12 లక్షల మందికి 1,090.76 కోట్లను సీఎం జగన్ విడుదల చేశారు. నేరుగా బటన్ నొక్కి, వారి వారి ఖాతాల్లోనే జమచేశారు. ఈ నిధులను విడుదల చేయడం ద్వారా 50 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని, వరుసగా నాలుగో యేడాది మూడో విడత వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తున్నామన్నారు.
నాలుగేళ్లలో ఒక్కో కుటుంబానికి 54 వేల చొప్పున సాయం అందించామని, ఈ నాలుగేళ్లలో రైతు భరోసా కింద 27,062 కోట్ల సాయం చేశామని తెలిపారు. ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే… అదే సీజన్ లో పరిహారం అందిస్తున్నామన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందని, నాలుగేళ్లుగా వర్షాలు బాగా పడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు.ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో పరిహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. మాండూస్ తుపాన్ వల్ల పంట నష్టపోయిన 91,237 మంది రైతులకు 76,99 కోట్లు అందిస్తున్నామని వివరించారు. చంద్రబాబు పాలన ప్రతి యేడాదీ కరువే వుండేదని, కరువుకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఏటా కరువు మండలాల ప్రకటనే వుండేదని విమర్శించారు.

ఇక.. రాష్ట్రంలో ఆహార ధాన్యాల దిగుబడి కూడా పెరిగిందని, రికార్డు స్థాయిలో ధాన్య సేకరణ చేస్తున్నామని అన్నారు. నాలుగేళ్లో 2.94 కోట్ల టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు. ఇప్పటి వరకూ రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు కుటుంబానికి 67 వేలు అందించామని, రాష్ట్ర వ్యాప్తంగా రైతు కుటుంబాలకు 27,062 కోట్ల రూపాయల నిధులు జమ చేశామని తెలిపారు.












