తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో అనేక సంస్కరణలు చేశామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. గతంలో కార్పొరేట్ స్కూళ్లకు మేలు కలిగించేలా విధానాలు వుండేవని, డ్రాప్ ఔట్ రేటు పెరుగుతున్నా… గత ప్రభుత్వం పట్టించుకోలేదని జగన్ మండిపడ్డారు. నాడు- నేడు పై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా విద్యా రంగంలో తమ ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలను జగన్ సభ వేదికగా పేర్కొన్నారు. కార్పొరేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దుతున్నామని, మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నామని వివరించారు.
చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలలను గాలికి వదిలేశారని, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను డెవలప్ చేస్తున్నామని జగన్ వివరించారు. నాడు- నేడు మొదట దశలో 15717 స్కూళ్లలో నాడు నేడు పూర్తయిందన్నారు. రెండో దశలో భాగంగా 22 వేల పాఠశాలలో డెవలప్ చేస్తున్నామని, నిర్మాణం పైనే కాదు, నిర్వాహణ పై కూడా తాము చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్ల నిర్వహణ కోసం ప్రత్యేక నిధినే ఏర్పాటు చేశామని సీఎం జగన్ తెలిపారు.