‘జగనన్నే మా భవిష్యత్తు’ అన్న నినాదంతో గడప గడపకూ వెళ్దాం : సీఎం జగన్

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ సమావేశం జరిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయ కర్తలు, జిల్లా అధ్యక్షులతో సీఎం జగన్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా చేయాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. జగనన్నే మా భవిష్యత్తు అన్న నినాదంతో ప్రతీ గడపకూ వెళ్లి, పనిచేయాలని కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు. గడపగడపకూ మన ప్రభుత్వం అన్న కార్యక్రమం అత్యంత కీలకమని, నిర్దేశించుకున్న విధంగానే దీనిని పూర్తి చేయాలని మరోసారి సూచించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలని, గత ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి గల భేదాన్ని వివరించాలన్నారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.

ఇప్పటికే అవసరాల రీత్యా 5 లక్షల మంది గృహ సారథులను నియమించుకున్నామని జగన్ తెలిపారు. ఫిబ్రవరి 16 లోగా మొత్తం భర్తీ చేయాలన్నారు. ఇలా చేయడం ద్వారా క్షేత్ర స్థాయిలో 5.65లక్షల మంది వైసీపీ సైన్యం అందుబాటులోకి వస్తుందన్నారు. వీరితోనే పార్టీ కార్యక్రమాలను కొనసాగించాలని స్పష్ట చేశారు. ఇప్పటికే 387 మండలాల్లో వీరికి శిక్షణ ఇచ్చారని, మిగిలిన మండలాల్లోనూ ఈ నెల 19 లోగా శిక్షణ ఇవ్వాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. వీరందరూ దాదాపుగా 1.65 కోట్ల ఇళ్లను సందర్శించి, ప్రభుత్వ పథకాలను వివరిస్తారని పేర్కొన్నారు. అయితే… గృహ సారథులను సమన్వయం చేసే బాధ్యతను సచివాలయ పార్టీ కన్వీనర్లకు అప్పగించారు.

 

పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చాలా చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. అందుకే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరాలని జగన్ ఆదేశించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానానికి మంత్రి బొత్స సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రకాశం- నెల్లూరు- చిత్తూరుకి బాలినేని శ్రీనివాస రెడ్డి, కడప- అనంతపురం- కర్నూలుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంచార్జులుగా వ్యవహరిస్తారు. మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీయే గెలవాలన్నారు.

Related Posts

Latest News Updates