తుపానుపై అందరూ అప్రమత్తంగా వుండాలని జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుపాన్ గా బలపడింది. రేపు అర్ధరాత్రి పుదుచ్చేరి శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో మూడు రోజుల పాటు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసే పనిలో వున్నారు.
తుపాను నేపథ్యంలో సీఎం జగన్ సీఎంవో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. తుపాన్ కారణంగా అందరూ అప్రమత్తంగా వుండాలని సూచించారు. ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకోవాలని, ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే రైతులకు అండగా నిలుస్తూ.. ఎప్పటికప్పుడు సూచనలిస్తూనే వుండాలని సూచించారు.












