ఏపీ ముఖ్యమంత్రి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాత్రి 10 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు సాగింది. రాష్ట్రంలోని సమస్యలు, రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలకు ఏపీకి సహకరించాలని సీఎం జగన్ కోరారు. అలాగే.. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముందస్తుగా పదివేల కోట్లు మంజూరు చేయాలని కూడా కోరారు. పోలవరం కోసం తమ సొంత ఖజానా నుంచి 2600.74 కోట్లు ఖర్చు చేశామని, గడచిన రెండు సంవత్సరాలుగా ఇవి పెండింగ్ లోనే వున్నాయని పేర్కొన్నారు.
వెంటనే ఈ బకాయిలు చెల్లించాలని కోరారు. ఏపీలో 12 మెడికల్ కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని, ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పరిశీలించాలని సీఎం జగన్ కోరారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని, 56 లక్షల కుటుంబాలకు రాష్ట్రమే సొంతంగా రేషన్ ఇవ్వడం వల్ల 5,527 కోట్ల భారం మోయాల్సి వస్తోందన్నారు. ఈ విషయంలో తాము అడుగుతున్న తీరు కూడా సరైందేనని నీతి ఆయోగ్ కూడా నిర్ణయించిందని జగన్ విన్నవించారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.
ఇక… రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. దీని వల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయన్నారు. ఆర్థికంగా రాష్ట్రానికి మేలు జరుగుతుందని, పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తాయని, సేవారంగం కూడా విస్తరిస్తుందన్నారు. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది.