ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో గురువారం భేటీ అయ్యారు. తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని అమిత్ షా ను కోరారు. గుజరాత్, ఢిల్లీ, గోవా, త్రిపురలో ఈ క్యాంపస్ లు వున్నాయి. దక్షిణ భారతంలో ఫోరెన్సిక్ రంగంలో సేవలందించే ఇలాంటి సంస్థ లేదని, దానిని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ కోరారు. ఇందులో భాగంగా తిరుపతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా జగన్ సూచించారు. అలాగే… రాష్ట్ర విభజన జరిగి… ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా… విభజన చట్టంలోని చాలా అంశాలు ఇప్పటికీ నెరవేరలేదని, ఇరు రాష్ట్రాల మధ్య కీలక అంశాలు ఇంకా పరిష్కారం కాలేదని జగన్ పేర్కొన్నారు. దీనితో పాటు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకి సంబంధించి పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని కూడా సీఎం జగన్ కోరారు.