శ్రీకాకుళం జిల్లా మూలపేట వేదికగా ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేవారు. ఈ సెప్టెంబర్ నుంచే విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ నవంబర్ నుంచే తాను కూడా విశాఖలోనే వుంటున్నానని తెలిపారు. అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ అని వ్యాఖ్యానించారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా విశాఖలోనే బస చేస్తానని, ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే అన్ని జిల్లాలను డెవలప్ చేస్తున్నామని వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి సీఎం శంకుస్థాపన చేశారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ సహా హిర మండలం వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రకటించారు. గత పాలకులు శ్రీకాకుళం జిల్లాను నిర్లక్ష్యం చేశారని, అభివృద్ధి చేయలేదన్నారు. తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు జిల్లా ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై.. మూలపేట అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుందని, భవిష్యత్తులో మూలపేట, విష్ణుచక్రం మరో ముంబై, మద్రాస్ కాబోతున్నాయని ప్రకటించారు. 24 నెలల్లో పోర్ట్ పూర్తవుతుందని, పోర్టు నిర్మాణానికి 4,362 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.
దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. పోర్టు వస్తే.. ఆధారిత పరిశ్రమలు కూడా వస్తాయని, అప్పుడు లక్షల్లో ఉద్యోగాలు వస్తాయన్నారు. గంగపుత్రుల కళ్లలో కాంతులు నింపడానికే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపడుతున్నామని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 4 పోర్టులు మాత్రమే వుండేవని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టామని సీఎం జగన్ అన్నారు.