పింఛన్ల విషయంలో ఇచ్చిన హామీని తాము నిలబెట్టుకున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పింఛన్లను పెంచుకుంటూ పోతామన్న హామీని నెరవేరుస్తున్నామని, రకరకాల సమస్యలతో బాధపడుతున్న అర్హులైన వారందరికీ అందుతున్నాయని వివరించారు. రాజమండ్రిలో పింఛన్ లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొత్తగా మరికొంత మందిని పింఛన్లు జాబితాలో చేర్చామని, అందుకోసం నిధులను కూడా విడుదల చేశామని ప్రకటించారు. కొత్తగా బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులను వాలెంటీర్లు ఇంటింటికీ వెళ్లి అందిస్తున్నారని గుర్తు చేశారు.
పింఛన్లు 2,500 నుంచి 2,750 రూపాయలకు పెంచామని సీఎం జగన్ గుర్తు చేశారు. ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదన్నారు. గత ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ అందేదని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంఖ్యను పెంచామన్నారు. ఇప్పుడు ఏకంగా 64 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నామని జగన్ అన్నారు. పింఛన్లు తొలగిస్తున్నామన్న ప్రచారాన్ని ఏమాత్రం నమ్మోద్దని సీఎ కోరారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా పింఛన్లు ఇస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ మండిపడ్డారు. ఎన్టీఆర్ను చంపేసి.. సీఎం కుర్చీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. కానీ ఎన్నికలొస్తే అదే ఎన్టీఆర్ ఫోటోకు దండేస్తారు. చంపేది బాబే.. మొసలికన్నీరు కార్చేది చంద్రబాబే.. ఫోటోషూట్.. డ్రామాలు చేయడమే చంద్రబాబు నైజం అని విమర్శించారు. గతంలో పుష్కరాల్లో 29 మందిని చంపారు.. ఇప్పుడు డ్రోన్షాట్ల కోసం కందుకూరులో 8 మందిని చంపేశారు. చంపేది ఆయనే.. మానవతావాదిలా డ్రామాలు ఆడేది ఆయనే అంటూ సీఎం జగన్ తీవ్రంగా దుయ్యబట్టారు.












