కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లు ఫెడరల్ స్ఫూర్తికే విరుద్ధమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లులపై తమకు అభ్యంతరాలున్నాయని తెలిపారు. అసెంబ్లీలో కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లుపై చర్చ జరిగిన సందర్బంగా భట్టి విక్రమార్క ప్రసంగించారు. విద్యుత్ అనేది ఉమ్మడి జాబితాలో వుందని, కానీ.. కేంద్రం ఒంటెద్దు పోకడగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాము తెచ్చిన చట్టాలను అమలు చేయాల్సిందేనని కేంద్రం ఒత్తిడి తేవడం సరికాదని, ఫెడరల్ స్ఫూర్తి అనిపించుకోదన్నారు.

 

కేంద్రం రైతుల మోటార్లకు మీటర్లు పెడతామని చెప్పడం సరికాదన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణ డెవలప్ అవుతోందని బీజేపీ తెగ ప్రచారం చేస్తోందని, సింగిల్ ఇంజిన్ తో చేయలేమా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శించారు. మోదీ ఫొటోలు పెట్టాలని కేంద్ర మంత్రి కలెకర్ట్ ను బెదిరించడం సిగ్గుచేటని పేర్కొన్నారు.