న్యాయాధికారుల శిక్షణ కోసం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఏపీ జ్యుడీషియల్ అకాడమీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ శుక్రవారం ప్రారంభించారు. మంగళగిరి మండలం ఖాజాలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, హైకోర్టు న్యాయమూర్తులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడారు. న్యాయవ్యవస్థలో టెక్నాలజీ కూడా అంతర్భాగమేనని, న్యాయవాదులందరూ టెక్నాలజీ నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు.
నూతన సాంకేతికతకు అనుకూలంగా మార్పులు చేసుకోవడం ముఖ్యమని తెలిపారు. కోర్టులు వివాదాల పరిష్కారమే కాదు.. న్యాయాన్ని కూడా నిలబెట్టేలా వుండాలన్నారు. కేసుల పరిష్కారంలో ఆలస్యాన్ని నివారించాలని, న్యాయవ్యవస్థను పరిరక్షించడానికి అందరి సహకారం కావాలని ఆయన కోరారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. న్యాయ వ్యవస్థలో కేసుల సంఖ్య కంటే తీర్పుల్లో నాణ్యతకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సీజేఐ పేర్కొన్నారు.












