చిరంజీవి టారిటబుల్ ట్రస్ట్ రక్తదాలను రాష్ట్ర గవర్నర్ తమిళి సై సన్మానించారు. రాజ్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి, తమిళి సై చేతుల మీదుగా రక్తదాతలకు ‘చిరు భద్రతా’ కార్డులను అందజేశారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో 50 కంటే ఎక్కువ సార్లు రక్తం దానం చేసిన వారిని ఈ సందర్భంగా సత్కరిస్తూ వారికి ‘చిరు భద్రతా’ కార్డుల పేరుతో లైఫ్ ఇన్సూరెన్స్ కల్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… ఒక డాక్టర్ గా ఎన్నో ఘటనలు చూశానన్నారు. రక్తం దొరక్క చనిపోయిన పేషెంట్లను చూశానన్నారు. రక్తం దొరకడం వల్ల ప్రాణాలతో బయటపడిన వాళ్లనూ చూశానన్నారు. రక్త దాతలను సన్మానించుకోడం సంతోషంగా ఉందన్నారు. చిరంజీవి గారు తన అభిమానులను మోటివెట్ చేసి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో జీవితాలు నిలబడ్డాయని, ఆయన రియల్ మెగాస్టార్ అని కొనియాడారు. ప్రతి రక్త దాత ఒక స్టార్ అని తమిళి సై వ్యాఖ్యానించారు.