అరుణాచల్‌లోని 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టి కయ్యానికి చైనా భారత్ పై కాలుదువ్వుతోంది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగం అంటూ చైనా చాలా కాలంగా కవ్విస్తూ వస్తోంది. ఇప్పుడు 11 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టి మరింత కవ్వింపులకు దిగింది. ఆ రాష్ట్రంలోని 11 ప్రదేశాల పేర్లను ప్రామాణికం చేసిన చైనా దీనిని ‘టిబెట్ దక్షిణ భాగం జాంగ్నాన్’ అని పిలుస్తుంది. చైనా పౌర వ్యవహారాలశాఖ మంత్రి ఏప్రిల్ 2వ తేదీన పేర్లను విడుదల చేశారు. చైనా కేబినెట్ నిర్ణయం మేరకు ‘జాంగ్‌నన్’ పేరుతో ఈ జాబితాను ఆ దేశం విడుదల చేసింది.
ఇది స్టేట్ కౌన్సిల్, చైనా క్యాబినెట్ జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని ఆ దేశ అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ సోమవారం నివేదించింది. ఈ పరిణామాలపై ఢిల్లీలోని ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ చైనా ఇలాంటి చర్యలకు దిగడం ఇదే తొలిసారి కాదని అన్నాయి. అంతేకాదు, పేర్ల మార్చినంత మాత్రాన క్షేత్రస్థాయిలో పరిస్థితి మారిపోదని వ్యాఖ్యానించారు. ‘అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికీ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే’ అని స్పష్టంచేశాయి.
ప్రస్తుతం భౌగోళిక పేర్లు మార్చిన వాటిలో ఐదు పర్వత ప్రాంతాలు, రెండు మైదానాలు, రెండు నివాస ప్రాంతాలు, రెండు నదులు ఉన్నాయి. అంతేకాదు, స్థలాలు, పేర్లు, వాటి అధీన పరిపాలనా జిల్లాల వర్గాలు కూడా పేర్కొన్నారు. ‘మంత్రిత్వ శాఖ జారీ చేసిన జాంగ్నాన్‌లోని ప్రామాణిక భౌగోళిక పేర్లలో మూడో బ్యాచ్. మొదటి బ్యాచ్ ఆరు ప్రదేశాలను 2017లో రెండో బ్యాచ్‌లో 15 స్థలాలను 2021లో విడుదల చేశాం’ అని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. గతంలోనే భారత్ చైనా తీరును తీవ్రంగా ఖండించింది. పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతాలు భారత్‌లో భాగం కాకుండా పోవని, నిజాన్ని మార్చలేరని స్పష్టం చేసింది.