చైనాలో బీబీసీకి చెందిన ఓ జర్నలిస్టుపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారు. అంతేకాకుండా అదుపులోకి తీసుకున్నారు. చైనా సర్కార్ కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండటంతో అక్కడి ప్రజలు కొన్ని రోజులుగా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ నిరసన కారులపై చైనా ప్రభుత్వం దమన కాండ కొనసాగిస్తున్న విషయం కూడా విదితమే. అయితే… ఈ నిరసనను కవర్ చేస్తున్న తమ జర్నలిస్టును పోలీసులు చితకబాదారని, అరెస్ట్ చేశారని మీడియా సంస్థ పేర్కొంది. దీనిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, జర్నలిస్టు విషయంలో తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నామని మీడియా సంస్థ పేర్కొంది. చివరికి… పోలీసులు ఆ జర్నలిస్టును విడిచిపెట్టారు. విధి నిర్వహణలో భాగంగా ప్రజా నిరసనను తాము కవర్ చేస్తున్నామని, అయినా… అక్కడి ప్రభుత్వం ఇంత నిరంకుశంగా వ్యవహరించిందని, చివరికి కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని మీడియా సంస్థ ఆక్షేపించింది.
మరోవైపు జిన్ పింగ్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వెంటనే చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార గద్దె నుంచి దిగిపోవాలని ప్రజలు డిమాండ్లు చేస్తున్నారు. పీసీఆర్ టెస్టులు తమకు వద్దంటే వద్దని, లాక్ డౌన్ తో విసిగిపోయామని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది ప్రజలు లాక్ డౌన్ ఆంక్షలను వ్యతిరేకిస్తూ రోజూ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. వీటిని అక్కడి ప్రభుత్వం కఠినంగా అణచివేస్తోంది.