భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. జస్టిస్ చంద్రచూడ్ పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ ప్రతిపాదించారు. ఈ మేరకు మంగళవారం సుప్రీం కోర్టులో ఫుల్ కోర్టు సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే పై నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును ప్రతిపాదిస్తూ.. సీజేఐ జస్టిస్ లలిత్ కేంద్రానికి లేఖ రాశారు. ప్రస్తుతం సీజేఐగా బాధ్యతల్లో వున్న జస్టిస్ యూయూ లలిత్ నవంబర్ 8 న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో నిబంధనల ప్రకారం సుప్రీం కోర్టులో వున్న అత్యంత సీనియర్ న్యాయమూర్తిని వారసుడిగా పేర్కొనే సంప్రదాయం నడుస్తోంది. ఇందులో భాగంగానే జస్టిస్ యూయూ లలిత్ జస్టిస్ చంద్రచూడ్ పేరును సిఫార్సు చేశారు.
సంప్రదాయం ప్రకారం ప్రస్తుత సీజేఐ తన వారసుడి పేరును ప్రతిపాదిస్తూ… కేంద్ర న్యాయశాఖకు పంపుతారు. ఆ లేఖను కేంద్ర న్యాయశాఖ ప్రధానమంత్రి పరీశలన కోసం పంపుతుంది. ప్రధాని పరిశీలించి, ఆమోదం పొందిన తర్వాత అది రాష్ట్రపతి వద్దకు చేరుకుంటుంది. చివరగా… రాష్ట్రపతి అనుమతితో నూతన సీజేఐ బాధ్యతలు స్వీకరించే సంప్రదాయం కొనసాగుతోంది.