చంద్రబాబు వర్సెస్ పోలీసులు… వైసీపీకి ఓ రూల్.. మాకో రూలా? అంటూ బాబు ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కర్ణాటక సరిహద్దు పెద్దూరుకు చేరుకున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. రోడ్‌షో, సభకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు పోలీసులపై తీవ్రమైన ఆవేశంతో ఊగిపోయారు. పోలీసులతో చంద్రబాబు తీవ్ర వాగ్వాదానికి దిగారు. అసలు ఎందుకు అనుమతి ఇవ్వరంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. పెద్దూరు వద్ద చంద్రబాబును అడ్డుకొని, పోలీసులు నోటీసులిచ్చారు. అయితే.. డీఎస్పీ ఇచ్చిన నోటీసులను తీసుకోవడానికి చంద్రబాబు నిరాకరించారు. అసలు ప్రభుత్వం ఇచ్చిన జీవోకు చట్టబద్ధతే లేదని విమర్శించారు. తనకు ఎందుకు నోటీసులిస్తున్నారో రాత పూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తన సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు ఆంక్షలు విధిస్తారా? వైసీపీకి ఓ రూలు, తమకు ఓ రూలా? అంటూ చంద్రబాబు పోలీసులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను సీఎంగా వున్న సమయంలో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేశారని, అప్పుడు తాము తలుచుకుంటే 365 రోజుల పాటు పాదయాత్ర చేసేవారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ సభలకు ప్రజలు వెళ్లకుంటే పెన్షన్లను కట్ చేస్తున్నారని, తన సభకు స్వచ్ఛందంగా వస్తుంటే మాత్రం అడ్డుకుంటున్నారని అన్నారు. 1861 పోలీసు యాక్ట్ 30 ప్రకారం జీవో ఇచ్చామని చెబుతున్నారని, 1861 పోలీసు చట్టానికి 1946 లో చేసిన సవరణను మాత్రం ప్రస్తావించలేదన్నారు. సీఎం జగన్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, సైకో పాలన పోయి, సైకిల్ పాలన రావాలని అనుకుంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates