సహజ వాయువు ధరల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నేచురల్ గ్యాస్ ధరల్ని నియంత్రించేందుకు కొత్త పద్ధతిని అమలులోకి తెచ్చింది. దీంతో వంట గ్యాస్, సీఎన్జీ ధరలు తగ్గనున్నాయి. గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఈ మేరకు గ్యాస్ ధరల మార్గదర్శకాలకు సవరణలు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అమెరికా, కెనడా, రష్యా వంటి విదేశాల్లోని గ్యాస్ ధరలతో కాకుండా దిగుమతి చేసుకున్న ముడి చమురు ధరతో అనుసంధానిస్తామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. దీని వల్ల పీఎన్జీ ధర 10 శాతం, సీఎన్జీ ధర 9 శాతం తగ్గుతుందని తెలిపారు. దీంతో సామాన్యుడికి ఊరట కలగనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు కేంద్రం గుడ్ న్యూస్ ప్రకటించింది. డీఏను 4శాతం పెంతున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతానికి పెరగనుంది. ఈ మేరకు కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వంపై రూ.12,815 కోట్ల భారం పడనున్నట్లు చెప్పారు.