బాగా తాగి, నడవలేని స్థితిలో వున్న పంజాబ్ సీఎం మాన్ ను జర్మనీలోని ఎయిర్ పోర్టులో విమానం నుంచి దించేశారన్న వార్త తమ దృష్టికి వచ్చిందని కేంద్ర విమానయాన శాఖ ప్రకటించింది. పంజాబ్ సీఎంపై వచ్చిన ఆరోపణలు తమదాకా వచ్చాయని, అయితే.. విదేశంలో జరిగిన ఘటన కాబట్టి, నిజానిజాలేమిటో తెలుసుకోవాలని కేంద్ర విమాన మంత్రి సింధియా పేర్కొన్నారు. లుఫ్తాన్సా విమానయాన సంస్థ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి చేయాల్సి వుందని, దీనిపై విచారణ చేపట్టాలని పలు డిమాండ్లు తమ దాకా వచ్చాయని వెల్లడించారు. అయితే… పంజాబ్ సీఎం ఘటనపై కచ్చితంగా విచారణ చేయిస్తామని సింధియా ప్రకటించారు.
జర్మనీ పర్యటన ముగించుకొని, ఢిల్లీకి తిరుగుపయన మైన సీఎం మాన్ ఫుల్లుగా తాగిన కారణంగా ఫ్రాంక్ ఫర్ట్ ఎయిర్ పోర్టులో ఆయన్ను దించేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఆయన ప్రవర్తన మూలాన విమానం నాలుగు గంటల ఆలస్యం కూడా అయ్యిందని వార్తలొచ్చాయి. దీనిని అకాలీదళ్ సుఖ్ బీర్ బాదల్ బయటపెట్టారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర దుమారం రేగింది. కేంద్రం దీనిపై విచారణ చేయాలని, సీఎం కేజ్రీవాల్ ఓ ప్రకటన చేయాలని శిరోమణి అకాలీదళ్ డిమాండ్ చేసింది. అయితే… విమానాన్ని మార్చాల్సి రావడం వల్లే ఆలస్యమైందని, లుఫ్తాన్సా సంస్థ విమరణ ఇచ్చింది.