తమిళనాడులో స్థానికుల తర్వాత అత్యధిక గౌరవం తెలుగువారికే : కిషన్ రెడ్డి

చెన్నైలోని ఆస్కా భవనంలో తెలుగువారి ఆత్మీయ సమావేశం జరిగింది. దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలిండియా తెలుగు ఫేడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ… తమిళనాడులో తమిళుల తర్వాత అత్యధికమైన గౌరవం తెలుగు వారికేనని, గతంలో ఇక్కడి నుంచే ఆంధ్రుల పరిపాలన సాగిందన్నారు. అమ్మ భాషను మర్చిపోకుండా మన పిల్లలకు కూడా నేర్పించాల్సిన బాధ్యత ప్రతి తెలుగు కుటుంబానిదన్నారు. తెలుగు వారంతా మాతృభాషపై పట్టు కలిగి ఒకే మాట మీద నిలబడితే తమిళనాడు ప్రభుత్వం స్పందిస్తుందని, ఇక్కడున్న 23 తెలుగు సంఘాల వారు రాజకీయం పక్కన పెట్టి భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు. తెలుగు వారిలో ఐకమత్యం లేనందువల్లే అమ్మ భాష కనుమరుగవుతోందని వాపోయారు.

తెలుగువారంతా ఏకమై, తమిళనాడులో హక్కుల కోసం పోరాడితే స్టాలిన్ ప్రభుత్వం సాయంత్రానికల్లా స్పందించి, జీవో ఇస్తుందన్నారు. ‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’కు సభాధ్యక్షుడిగా వ్యవహరించిన సీఎంకే రెడ్డి మాట్లాడుతూ, తమిళనాడు జనాభాలో దాదాపు 2 కోట్ల మంది తెలుగు వారు ఓటు హక్కు కలిగి ఉన్నారని, 23 గుర్తింపు పొందిన తెలుగు సంఘాలున్నప్పటికీ, రాష్ట్రప్రభుత్వం నుంచి గుర్తింపు రాలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తమిళనాడు కో-ఇన్‌ఛార్జి డా.పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆస్కా అధ్యక్షులు డా.కె.సుబ్బారెడ్డి, డా.సీఎం కిషోర్‌, పారిశ్రామికవేత్త అనీల్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ న్యాయవాది జె.మదన్‌గోపాల్‌రావు, అమర్‌ ప్రసాదరెడ్డి, గొల్లపల్లి ఇశ్రాయేలు, సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌, ఏఐటీఎఫ్‌ మద్రాసు రీజియన్‌ చైర్మన్‌ కేవీ జనార్ధనం, అడ్వొకేట్‌ కేఎల్‌ కిరణ్‌ పాల్గొన్నారు.

Related Posts

Latest News Updates