త్వరలో పెట్రోలు ధరలు తగ్గుతాయని పెట్రోలియం శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పురీ పర్కొన్నారు. గతంలో పెట్రోల్ విక్రయంపై ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను చవిచూశాయని, ఇప్పుడు.. అంతర్జాతీయంగా తగ్గిన ధరలతో అవి లాభాలు చూస్తున్నాయని చెప్పుకొచ్చారు. కానీ… పెట్రోల్ పై లాభాలు వస్తున్నా.. డీజిల్ పై ఇప్పటికీ నష్టపోతూనే వున్నామని వివరించారు. గడిచిన ఏడాదికి పైగా పెట్రోలియం కంపెనీలు రేట్లను సవరించడం లేదని, ఈ నష్టాలు ముగింపునకు రాగానే పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలు తగ్గుతాయని పురి వివరించారు.
అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా వినియోగదారులపై ఆ భారాన్ని మోపకుండా ఆయిల్ కంపెనీలు బాధ్యతాయుత కార్పొరేట్ సంస్థలుగా వ్యవహరించాయని పేర్కొన్నారు. గత 15 నెలలుగా పెట్రో ధరలను మార్చకుండా.. చమురు కంపెనీలు చేసిన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మాత్రం ధరలను మార్చడం లేదని పేర్కొన్నారు.












