సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ అధిపతి ఏబీ వేంకటేశ్వర రావును డిస్మిస్ చేయాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర హోంశాఖ తిరస్కరించింది. ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించడానికి, తప్పనిసరిగా పదవీ విరమణ చేయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అయితే… పెనాల్టీ పరంగా 2024 మే 31 వ తేదీ వరకూ 2 ఇంక్రిమెంట్లను మాత్రం నిలిపేయాలని సూచించింది. వెంకటేశ్వరరావు పాలనాపరమైన లోపాలకు పాల్పడి ఉంటే ఆయన ఇంక్రిమెంట్లు మాత్రమే కట్ చేయాలని యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ఇచ్చిన సలహా మేరకు కేంద్ర హోంశాఖ రాష్ట్రానికి సూచన పంపింది. ఈ చర్య తీసుకుని ఆ విషయాన్ని తమకు తెలియజేయాలని సూచించింది. ఈ మేరవకు ఏపీ సీఎస్ కె.ఎస్.జవహర్‌రెడ్డికి జనవరి 10న కేంద్ర హోంశాఖ అండర్ సెక్రెటరీ సంజీవ్ కుమార్ లేఖ రాశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ఏబీ వెంకటేశ్వరరావు నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో వైఎస్ జగన్ సర్కారు మూడేళ్ల క్రితం ఆయనను విధుల నుంచి తొలగించింది. ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వెంకటేశ్వరరావుపై కేసు కూడా పెట్టింది. ఆయన్ను డిస్మిస్ చేయాలంటూ 2021 డిసెంబర్ లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలోనే ఏబీకి ఎలాంటి పెనాల్టీ విధించాలో సూచించాలని యూపీఎస్సీని హోంశాఖ అడిగింది. 2 ఇంక్రిమెంట్లను నిలిపేయాలని యూపీఎస్సీ సిఫార్సు చేసింది. ఈ విషయాన్నే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది.












