నేరాలు, ప్రమాదాలు, హింసకు సంబంధించిన వార్తల ప్రసారాల విషయంలో టీవీ చానళ్లకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. మృతదేహాలు, రక్తపు మడుగులో పడి వున్న వారి ఫొటొలు, భయం గొలిపే వీడియోలను ఉన్నది ఉన్నట్టుగా రిపోర్ట్ చేయవద్దని సూచించింది. ఇలాంటి వాటిని ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తే.. చిన్నారులు, ఇతరులపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. ఇలాంటి ఫుటేజీలు ప్రేక్షకులను కలవరపాటుకు గురి చేస్తాయని, బాధ కలిగిస్తాయని తెలిపింది. ఇలా చేయడం ప్రోగ్రామ్ కోడ్ నిబంధనలకు పూర్తి వ్యతిరేకమని పేర్కొంది. వీటి విషయంలో బాధ్యతాయుతంగా ప్రసారం చేయాలని ఆదేశించింది. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలోనే కేంద్రం ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది. చాలాకేసుల్లో సోషల్ మీడియోలో నుంచి వీడియోలను తీసుకుని, ఎలాంటి సమీక్ష లేకుండా, సవరణలు చేయకుండా, ప్రోగ్రామ్ కోడ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ప్రసారం సాగిస్తున్నారని మంత్రిత్వ శాఖ మండిపడింది.
కొన్ని ఛానళ్లు మృతదేహాలు, రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుల ఫోటోలను బాగా దగ్గరుండి చూపిస్తున్నాయి. టీచర్లు పిల్లలను కొట్టే వీడియోలు, మహిళలు, చిన్నారులు, పెద్దలపై దాడుల ఫుటేజ్‌లను రిపీట్‌గా కూడా ప్రసారం చేస్తున్నాయి. బ్లర్రింగ్ చేయకుండానే చూపిస్తున్నాయి. ఇలా రిపోర్ట్ చేయడం బాధాకరమే కాకుండా, ప్రోగ్రామ్ కోడ్ నిబంధనలకు విరుద్ధం. వీక్షకులను కూడా ఇవి కలవరపాటుకు గురిచేస్తాయి. చిన్నారులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. బాధితుల గోప్యతకు కూడా భంగం కలుగుతుంది. అని సమాచార శాఖ పేర్కొంది.












