ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా అలజడి ప్రారంభమైపోయింది. చైనాతో సహా పలు దేశాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే రెండు అత్యున్నత స్థాయి సమావేశాలను నిర్వహించింది. ఒకటి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కాగా… మరొకటి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తూ.. దేశంలో కొవిడ్ వ్యాప్తిని పరిశీలిస్తోంది. కొవిడ్ టెస్టులు, క్వారంటైన్ సదుపాయాలు, వ్యాక్సిన్ మొదలుకొని ఆసుపత్రుల్లో చేయాల్సిన ఏర్పాట్లపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తోంది.
కరోనా కేసులు పెరిగిపోవడంతో రెండో బూస్టర్ డోస్ పై సోషల్ మీడియాలో, అటు దేశ వ్యాప్తంగా తీవ్రమైన చర్చ నడుస్తోంది. రెండో బూస్టర్ డోస్ వేసుకోవాలా? వద్దా? వేసుకుంటే దాని పరిణామాలు? ఇలా చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెకండ్ బూస్టర్ డోస్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కరోనా ముప్పు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి రెండో బూస్టర్ డోస్ అవసరం లేదని అభిప్రాయపడ్డాయి. కరోనా నిరోధానికి బూస్టర్ డ్రైవ్‌ను పూర్తి చేయడం ప్రభుత్వ మొదటి లక్ష్యం అని పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకూ 220 కోట్ల డోసులకు చేరుకుందని ప్రకటించింది.












