తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు తెలంగాణకు కూడా వస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రారంభమవుతుందని రైల్వే అధికారులు ప్రకటించారు. అయితే.. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఏయే ప్రాంతాలకు నడపాలన్న దానిపై రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. గరిష్ఠంగా 10 గంటల లోపే చేరే గమ్య స్థానాలను అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అత్యంత వేగంగా, అత్యంత ఆధునికంగా ఈ రైలు వున్నా… అందులో బెర్తులు లేని కారణంగా ప్రయాణికులు ఎక్కువ దూరం ప్రయాణిస్తే అలసి పోతారన్నది రైల్వే భావన.
అయితే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, విశాఖ, ముంబై వంటి నగరాలకు ఎక్కువ రద్దీ వుంటుందని, ఆ రూట్లలో నడిపితే బాగుంటుందన్న అభిప్రాయం వచ్చింది. ఈ రూట్లలో ఎన్ని రైళ్లు వేసినా… రద్దీ తగ్గడం లేదు. అందుకే ఈ రూట్లలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. అధికారికంగా మాత్రం ఇంకా రూట్ ఖరారు కాలేదు. ఇప్పటికే భారత్ లో 4 వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల క్రితమే చెన్నై బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్ ను విజయవంతం చేసుకుంది.