రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం “తల్లి మనసు”.. పూర్వాశ్రమంలో పలువురు ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి, అనుభవం గడించిన వి.శ్రీనివాస్ (సిప్పీ) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ తొలిసారి నిర్మాతగా మారి, నిర్మించిన చిత్రమిది.
ఇటీవలనే తొలికాపీ సిద్దమైన ఈ చిత్రం, సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని నిర్మాత ముత్యాల అనంత కిషోర్ తెలియజేస్తూ, “ఈ చిత్రాన్ని చుసిన సెన్సార్ సభ్యులు చాలా బావుందని, తల్లికి సంబందించిన ఓ మంచి సబ్జెక్టుతో ఇటీవల కాలంలో ఇలాంటి చిత్రం రాలేదని ప్రశంసించడం ఆనందంగా ఉంది. అలాగే కొద్ది రోజుల క్రితం పోస్ట్ ప్రొడక్షన్ దశల్లో మా సినిమాను చూసిన కొందరు స్నేహితులు సైతం అభినందించారు. డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో కానీ అనుకూలమైన తేదీని చూసుకుని చిత్రాన్ని విడుదల చేస్తాం. నైజాంలో ఈ చిత్రాన్ని ఏషియన్ ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేస్తాం” అని చెప్పారు.
చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, “తల్లి సబ్జెక్టుతో ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలని మేము ఏదైతే ఆశించి, మా సొంత బ్యానర్ లో ఈ చిత్రాన్ని తీశామో అది నెరవేరింది. ఒక మంచి సబ్జెక్టుతో మా అబ్బాయి నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ కావడం సంతోషదాయకం”. అని అన్నారు
దర్శకుడు వి.శ్రీనివాస్ (సిప్పీ) మాట్లాడుతూ, “గతంలో తల్లి సబ్జెక్టుతో ఎన్నో సినిమాలు వచ్చి, ఉండవచ్చు. కానీ ,ఓ మధ్య తరగతి తల్లి ఎలాంటి సంఘర్షణలకు గురయ్యిందన్న అంశాన్ని ప్రేక్షకులకు హత్తుకునేలా వైవిధ్యముగా చెప్పాం. తెరపై ఎక్కడా ఆర్టిస్టులు కనిపించరు. ఆద్యంతం పాత్రలు మాత్రమే కనిపించి, ప్రేక్షకుడు కథలో లీనమవుతాడు” అని అన్నారు. .
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో , రఘుబాబు, శుభలేఖ సుధాకర్, సాహిత్య, వైష్ణవి, దేవిప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, శాంతకుమార్, గౌతం రాజు, దేవిశ్రీ, జబర్దస్త్ ఫణి తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి మూల కథ: శరవణన్, కదా విస్తరణ: ముత్యాల సుబ్బయ్య, మరుధూరి రాజా, మాటలు: నివాస్, పాటలు: భువనచంద్ర, సంగీతం: కోటి, డి.ఓ.పి: ఎన్.సుధాకర్ రెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, ఆర్ట్: వెంకటేశ్వరరావు, సమర్పణ: ముత్యాల సుబ్బయ్య, నిర్మాత: ముత్యాల అనంత కిషోర్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.శ్రీనివాస్ (సిప్పీ) .