కేంద్ర దర్యాప్తు సంస్థ CBI అరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో డైమండ్ జుబ్లీ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే ప్రెసిడెంట్స్ పోలీసు మెడల్స్ తో పాటు ఉత్తమ దర్యాప్తు అధికారులకు మోదీ మెడల్స్ ప్రదానం చేశారు. అలాగే షిల్లాంగ్, పూణే, నాగపూర్ లో కొత్తగా ఏర్పాటు చేసిన సీబీఐ కాంప్లెక్స్ లను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీబీఐ పనితీరును ప్రధాని మోదీ ప్రశంసించారు. 2014 తర్వాతే సీబీఐ స్వతంత్రంగా పనిచేస్తోందని అన్నారు. న్యాయానికి సీబీఐ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయిందని, అందుకే న్యాయం కోసం ప్రతి ఒక్కరూ సీబీఐ విచారణ చేయాలని డిమాండ్లు చేస్తారన్నారు.
సామాన్య ప్రజానీకానికి సీబీఐ ఓ నమ్మకంగా గుర్తింపు పొందిందని ప్రకటించారు. దేశంలోని అవినీతిపరుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టొదని మోదీ సూచించారు. ఇప్పుడు దాడులు జరుగుతున్న వారి జాబితాలో చాలా శక్తిమంతులు వున్నారని, ముఖ్యమంగా ప్రభుత్వ వ్యవస్థలో చాలా సంవత్సరాలుగా కూరుకుపోయిన వారు కూడా వున్నారని, మరి కొందరు రాష్ట్రాల్లో ప్రభుత్వంలో కూడా వున్నారని అన్నారు. అయినా…. వారిపై విడిచిపెట్టొదని, వారందరిపై దృష్టి పెట్టాలని సూచించారు. అవినీతి పరులను మాత్రం విడిచిపెట్టొద్దన్నారు.
10 సంవత్సరాల క్రితం దేశంలో అవినీతి చేసేందుకు తెగ పోటీ వుండేదని, ఆ సమయంలోనే పెద్ద పెద్ద కుంభకోణాలు కూడా జరిగాయని పరోక్షంగా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. అయినా నిందితులు మాత్రం భయపడలేదని, వారందరికీ అప్పటి వ్యవస్థలు అండగా నిలిచాయన్నారు. 2014 తర్వాత తమ ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా, నల్లధనానికి వ్యతిరేకంగా మిషన్ మోడ్ లో పనిచేస్తున్నామన్నారు. సమర్థవంతమైన సంస్థలు దేశంలో లేకపోతే అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించడం సాధ్య్ కాదన్నారు. అవినీతి అనేది ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థకు అతిపెద్ద అవరోధంగా మారిందని పేర్కొన్నారు. ఈ అవినీతి నుంచి భారత్ ను విముక్తి చేయడం సీబీఐ ముందున్న అతిపెద్ద బాధ్యత అని అన్నారు.