జమ్మూ కశ్మీర్ లోని ఉధంపూర్ లో రెండు భారీ పేలుళ్లు జరిగాయి. బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో దొమాయిల్ చౌక్ లో నిలిపి వున్న బస్సులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అయితే.. ఈ పేలుడు సమయంలో కండక్టర్ తో సహా మరో వ్యక్తి కూడా బస్సులోనే వున్నారు. పేలుడుతో వీరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.
ఇక… ఈ ఘటన జరిగిన కాసేపటికే మరో బస్సులో మరో పేలుడు సంభవించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. నేటి ఉదయం 5 గంటల సమయంలో ఉధంపూర్ బస్టాండ్ లో నిలిచి వున్న బస్సులో ఓ పేలుడు సంభవించింది. అయితే.. ఈ దాడిలో ఎవ్వరూ గాయపడలేదు. మొదటి పేలుడుకు 4 కిలోమీటర్ల దూరంలోనే ఈ పేలుడు సంభవించింది. ఈ రెండు పేలుళ్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే పేలుడుకు గల కారణాలు మాత్రం తెలియడం లేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు.
వచ్చే నెలలో జమ్మూ కశ్మీర్ లో అమిత్ షా పర్యటన
వచ్చే నెల అక్టోబర్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ కశ్మీర్ లో పర్యటించనున్నారు. 3 రోజుల పాటు అమిత్ షా అక్కడే వుంటారు. త్రికూటా హిల్స్ లోని మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం రాజౌరీ, బారాముల్లాలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అమిత్ షా పర్యటనకు కొద్ది రోజు ముందు ఈ రెండు పేలుళ్లు సంభవించడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.