ఈ నెల 19 న ఢిల్లీ నేతల సమక్షంలో బీజేపీలో చేరుతున్నానని టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రకటించారు. బీజేపీలో చేరడం ఘర్ వాపసీ లాంటిదని, పదవుల కోసం పార్టీ మారడం లేదని తేల్చి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్వంలో పలువురు నేతలు బూర నర్సయ్య గౌడ్ ఇంటికి వెళ్లి… చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టీఆర్ఎస్ లో తనకు గౌరవం దక్కలేదని, ఉప ఎన్నిక విషయంలో ఒక్కసారి కూడా తనతో పార్టీ చర్చించలేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ను కలవడం ఇప్పుడొక ఉద్యమంలా మారిందని విమర్శించారు. పార్టీలతో సంబంధం లేకుండా కేంద్రం అభివృద్ధికి సహకరిస్తోందన్నారు. బీజేపీ సిద్ధాంతమైన సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనేది తన జీవిత ఫిలాసఫీ అన్నారు.
టీఆర్ఎస్.. తెలంగాణ ద్రోహుల పార్టీగా మారిందని.. నిజమైన ఉద్యమకారులకు బీజేపీ వేదికైందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. స్వలాభం కోసం కాకుండా రాష్ట్ర భవిష్యత్ కోసమే బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. బూర నర్సయ్య గౌడ్ నిజాయితీకి మారు పేరని కొనియాడారు. దుబ్బాక, హుజూరాబాద్‌కు కేంద్రం ఇచ్చిన నిధులపై స్పష్టతనిచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను కేసీఆర్ ఇవ్వట్లేదన్నారు. బైపోల్స్‌లో ముఖ్యమంత్రిని ఒక గ్రామానికి ఇంచార్జ్‌గా పరిమితం చేసిన ఘనత బీజేపీదే అని అన్నారు.