ఫిబ్రవరి మూడు నుంచి తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాససనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు నోటిఫికేషన్ విడుదల చేశారు. 8వ సెషన్లో 4వ సమావేశాలు మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అదేరోజు 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ర్ట బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది. సభ ఎన్నిరోజులు నిర్వహించాలి? ఎన్ని బిల్లులు ప్రవేశపెడతారు? ఏయే అంశాలపై చర్చ ఉంటుంది? తదితర విషయాలపై మొదటి రోజే స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీలో, శానసమండలి చైర్మన్ అధ్యక్షతన శాసనమండలిలో జరిగే బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశాల్లో నిర్ణయం తీసుకోనున్నారు.
ప్రస్తుత ఏడాది రూ.2.56 లక్షలకోట్ల బడ్జెట్ అమాంతం రూ.40వేల కోట్ల పెంపుతో భారీ సైజుకు చేర్చేలా సీఎం కేసీఆర్ ఆమోదమద్ర వేసినట్లు తెలిసింది. దీంతో రూ.2.95 లక్షల కోట్లకు బడ్జెట్ పద్దు తుది ఆమోదం దిశగా సిద్దం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు రాబడి శాఖలకు భారీ లక్ష్యం నిర్దేశించినట్లు సమాచారం. కీలక శాఖలనుంచి ఆదాయపెంపులో భాగంగా లీకేజీలు, వృధా కట్టడి, మరింత పారదర్శక విధానాల దిశగా కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. దీంతో ఈ ఏడాది సాగునీటి నామ వార్షిక బడ్జెట్ దిశగా ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆర్ధిక శాఖకు దిశానిర్దేశం చేశారు.