టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారిపోయింది. బీఆర్ఎస్ అనే పేరును ఆమోదిస్తూ… కేంద్ర ఎన్నికల సంఘం ఓ లెటర్ ను కూడా పంపింది. ఇప్పుడు ఇదే ప్రాసెస్ ఉభయ సభల్లోనూ జరిగింది. టీఆర్ఎస్  పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ (BRS) పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్,  లోక్‌సభ స్పీకర్‌ కు బీఆర్ఎస్ ఎంపీలు వినతిపత్రం ఇచ్చారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్, లోకసభ స్పీకర్ ఓం బిర్లా ను కలిసి కేసీఆర్ పంపిన లేఖను టీఆర్ఎస్ ఎంపీలు అందజేశారు. బీఆర్ఎస్ ఎంపీల విజ్ఞప్తికి రాజ్యసభ ఛైర్మన్ వెంటనే స్పందించారు.

పార్టీ పేరును ఇకపై బీఆర్ఎస్‌గా మార్చాలని అధికారులను చైర్మన్ ఆదేశించారు. లోక్‌సభ స్పీకర్ సైతం టీఆర్ఎస్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు.దీనిపై బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పేరును బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీగా మార్చాలని రాజ్యసభ చైర్మన్, లోక్ సభ స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చామన్నారు. రేపటి నుంచి పార్లమెంట్‌లో అధికారికంగా బీఆర్ఎస్ ఎంపీలం అవుతామన్నారు.