ఈడీ విచారణ విషయంలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC KAVITHA) ఢిల్లీ వేదికగా స్పందించారు. ఈడీ విచారణకు వందకు వంద శాతం సహకరిస్తామని ప్రకటించారు. ఢిల్లీలో కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… 9న విచారణకు రావాలని ఈడీ(ED) నోటీసు ఇచ్చిందని, 11న విచారణకు తమ ఇంటికి రమ్మని ఈడీని కోరానన్నారు. ఈమేరకు ఈడీకి సమాచారం ఇచ్చినా ఈడీ ఒప్పుకోలేదన్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు విచారించరని కవిత ప్రశ్నించారు. మహిళలను ఇంట్లో విచారించాలని చట్టం చెబుతోందని, దర్యాప్తు సంస్థలు మహిళలను విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీం కోర్టుకి కూడా వెళ్తామని స్పష్టం చేశారు. ఈడీ విచారణకు 2 రోజుల సమయం అడిగామని, తమకు 2 రోజుల సమయం ఇస్తే తప్పేంటని నిలదీశారు. బీజేపీని ప్రశ్నించిన విపక్షాలపై దర్యాప్తు సంస్థలతో దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. తమ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కేంద్రం లక్ష్యంగా చేసుకుందన్నారు.

 

మార్చి 10 దీక్ష చేపడతామని అనగానే మార్చి 9 న విచారణకు రావాలని ఈడీ సమన్లను ఇచ్చిందని కవిత అన్నారు. ముందస్తు కార్యక్రమాలకారణంగా 11న విచారణకు వస్తానని చెప్పానని, అలా చెప్పినా 9 నే రావాలని ఈడీ నోటీసులిచ్చిందన్నారు. నవంబర్, డిసెంబర్ లో తెలంగాణ ఎన్నికలు రావొచ్చని, ఎన్నికల ముందు దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించడం బీజేపీ విధానమని విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ నేతలను భయభ్రాంతులకు గురి చేయడమే బీజేపీ లక్ష్యమని విరుచుకుపడ్డారు.

 

ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్ సంతోష్ సిట్( SIT ) ముందుకు ఎందుకు రావ‌డం లేదని ప్రశ్నించారు.  సిట్ ముందుకు వ‌చ్చేందుకు బీఎల్ సంతోష్‌కు భ‌య‌మెందుకు..? అని క‌విత‌ నిలదీశారు.  బీజేపీ నేత‌లు, బీజేపీలో చేరిన నేత‌లపై ఈడీ, సీబీఐ కేసులు ఉండ‌వు. బీజేపీని ప్ర‌శ్నించిన విప‌క్షాలపై ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో దాడులు, కేసులు పెడుతారు. త‌మ వైపు స‌త్యం, ధ‌ర్మం, న్యాయం ఉంది. ఏ విచార‌ణనైనా ధైర్యంగా ఎదుర్కొంటాం అని క‌విత తేల్చిచెప్పారు.

 

దేశంలో డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇందులో ఓ  ఇంజన్ ప్రధాని మోడీ అయితే… మరో ఇంజన్ అదానీ అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడంలో శ్రద్ధ చూపెడుతున్న మోడీ..దేశంలో సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.