కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ లో ముసలం పుట్టింది. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఏకంగా ఐదుమంది ఎమ్మెల్యేలు అసమ్మతి గళం వినిపించారు. ఆయన ఒంటెద్దు పోకడని తాము ఏమాత్రం భరించలేకపోతున్నామని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ లో ముసలం పుట్టింది. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు నివాసంలో వీరందరూ భేటీ అయ్యారు. వివేకానంద్, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, బేతి సుభాష్‌‌రెడ్డి ఈ సమావేశంలో వున్నారు. మేడ్చల్ కే అన్ని పదవులను తీసుకెళ్తున్నారని ఈ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. రాత్రికి రాత్రే జీవో పాస్ చేసి, భాస్కర్ యాదవ్ అనే వ్యక్తితో మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించారని మండిపడుతున్నారు. ఈ విషయాన్ని కేసీఆర్​, కేటీఆర్​ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

అయితే… దీనిపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. తాను గాంధేయవాదినని.. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోనని అన్నారు. తమ మధ్య అంతా సమస్య లేదని, తానే ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడతానన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను తన ఇంటికి ఆహ్వానిస్తానని.. ఇది మా ఇంటి సమస్య అని మీడియానే ఎక్కువగా చూపిస్తోందని అన్నారు. టీఆర్ఎస్ క్రమశిక్షణ గల పార్టీ అని.. పదవులు ఇచ్చేది తాను కాదని.. కేసీఆర్, కేటీఆర్ ఇస్తారని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.